Andhra Pradesh: వైజాగ్ ను ప్రపంచంలోనే టాప్-4 సాఫ్ట్ వేర్ నగరాల్లో ఒకటిగా నిలబెడతాం!: సీఎం చంద్రబాబు

  • సాఫ్ట్ వేర్ కంపెనీలకు వైజాగ్ అత్యంత అనుకూలం
  • విభజన సమస్యలను సాంకేతికతతో అధిగమించాం
  • ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా మారుస్తాం
నూతన టెక్నాలజీ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 1995లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎటువైపు తీసుకువెళ్లాలన్న దానిపై మేధోమథనం నిర్వహించామని వెల్లడించారు. ఈ సందర్భంగా తాను హైదరాబాద్ ను, సైబరాబాద్ ను సృష్టించానని పేర్కొన్నారు. కేవలం 20 ఏళ్లలో ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని సీఎం అన్నారు.

ఈ రోజు వైజాగ్ లోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన ఫిన్ టెక్-2.ఓ సదస్సులో పలు కంపెనీల సీఈవోలు, అధినేతలను ఉద్దేశించి బాబు ప్రసంగించారు. హైదరాబాద్ తరహాలోనే విశాఖపట్నంను తీర్చిదిద్దేందుకు 2016లో ఫిన్ టెక్ సదస్సును వైజాగ్ లో ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. ఈ పోటీకి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే టాప్-4 సాఫ్ట్ వేర్ నగరాల్లో ఒకటిగా విశాఖపట్నం నిలుస్తుందని జోస్యం చెప్పారు.

చల్లటి వాతావరణం, వేసవి రిసార్టులు విశాఖకు సహజ ఆభరణాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం నవకల్పన, ఇంకుబేషన్, స్టార్టప్ ల వైపు నడుస్తోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ సమస్యలు, సవాళ్లను సాంకేతికతల ద్వారా అధిగమించామని చంద్రబాబు అన్నారు. అధికారులు, నేతల ప్రత్యక్ష జోక్యం లేకుండా పనులు జరిగేలా ‘విజిబుల్ గవర్నెన్స్-ఇన్విజిబుల్ గవర్నమెంట్’ విధానాన్ని తాము పాటిస్తున్నట్లు ఏపీ సీఎం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా ఇన్నోవేషన్ వ్యాలీగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా ఏపీని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంను ప్రభుత్వం ఫిన్ టెక్ సిటీగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రస్తుతం అమరావతిలో మీడియా సిటీ, గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ,టూరిజం సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి-చెన్నై-కృష్ణ పట్నం ప్రాంతం సిలికాన్ కారిడార్ గా మారిందన్నారు. ఇక్కడ ప్రస్తుతం 30 శాతం ఫోన్లు తయారవుతున్నాయని తెలిపారు. దీన్ని 60 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
Andhra Pradesh
Visakhapatnam District
fintek 2.o
Chandrababu
Nara Lokesh
softwear
it indudtry
Hyderabad
syberabad
Tirupati
chennai
Nellore District

More Telugu News