Andhra Pradesh: రాజకీయ హత్య కాదు, కుటుంబ హత్యే.. వైసీపీ నేత కేశవరెడ్డి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు!

  • ఆస్తి, ఇతర గొడవలే కారణం
  • స్వయంగా స్కెచ్ వేసిన అన్న కొడుకు
  • నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
కుటుంబ కలహాలతోనే కర్నూలు జిల్లా ఆత్మకూరులో వైసీపీ నేత కేశవరెడ్డిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. కేశవరెడ్డిని స్వయంగా ఆయన అన్న కుమారుడు నరసింహారెడ్డి, వారాదప్ప అలియాస్ వెంకటేశులు, విశ్వనాథరెడ్డి కలిసి హత్య చేశారని వెల్లడించారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమన్నారు. ఆస్తితో పాటు చిన్నచిన్న గొడవలు చెలరేగిన నేపథ్యంలో నరసింహారెడ్డి  కేశవరెడ్డి హత్యకు ప్లాన్ వేశాడన్నారు.

ఇందులో భాగంగా హత్య చేసేందుకు వారాదప్పను నరసింహారెడ్డి సంప్రదించాడని అన్నారు. హత్యకు రూ.10 వేలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్సుగా రూ.వెయ్యి చెల్లించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కర్నూలుకు వెళ్లిన వీరు వేట కొడవళ్లను కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న తోటకు వెళ్లి వస్తున్న కేశవరెడ్డిపై వేట కొడవళ్లతో దాడిచేశారు.

అనంతరం ఓ బండరాయితో తలపై మోది అక్కడి నుంచి పారిపోయారు. చివరికి వారి దాడి నుంచి కొనప్రాణాలతో తప్పించుకున్న కేశవరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి పరిటాల సునీత వర్గీయులే కేశవరెడ్డిని హతమార్చారని ఆయన బంధువులు అప్పట్లో ఆరోపించారు.
Andhra Pradesh
Kurnool District
YSRCP
killed
Police
murder
family
paritala sunita

More Telugu News