driving licence: ఓటరుగా నమోదైతేనే.. డ్రైవింగ్‌ లైసెన్స్‌!

  • దరఖాస్తుతో పాటు గుర్తింపు కార్డు చూపాల్సిందే
  • మహబూబాబాద్‌ డీటీఓ కొత్త నిబంధన
  • వాహన రిజిస్ట్రేషన్‌కు ఇదే విధానం అమలు
పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిభారతీయ పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేస్తోంది ఎన్నికల కమిషన్. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తోంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓటు హక్కు పొందే విషయంలో ఇంకా చాలామంది యువత నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.

దేశ భవిష్యత్తును నిర్దేశించే విషయంలో యువతే కీలకమని, అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలన్న ఉద్దేశంతో మహబూబాబాద్‌ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) భద్రునాయక్‌ కొత్త నిబంధన తెరపైకి తెచ్చారు. ఇకపై ఎవరైనా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వచ్చినా, వాహన రిజిస్ట్రేషన్‌/బదలాయింపు చేయించుకోవాలన్నా తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సిందే అంటున్నారు. లేదంటే వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. ఈ నిబంధనపై సామాజిక మాధ్యమాలు, వివిధ గ్రూపుల్లో పోస్టింగ్స్‌ పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్న సదాశయంతో పెట్టిన నిబంధన ఇది. అందరూ సహకరించాలి’ అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
driving licence
Mahabubabad District
transport office

More Telugu News