Titli cyclone: తిత్లీ తుపాను ఎఫెక్ట్.. కూలిపోయిన విద్యుత్ టవర్లు.. తెలంగాణకు సరఫరాలో ఇబ్బందులు!

  • తుపాను కారణంగా కూలిన టవర్లు
  • తెలంగాణలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు
  • మూడు రోజులు ఓపిక పట్టాలన్న ప్రభాకర్ రావు
తిత్లీ తుపాను కారణంగా విద్యుత్ టవర్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరఫరాను పునరుద్ధరించేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు కోరారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ, ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాల్లో సోమవారం ఆయన గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరాపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిత్లీ తుపాను కారణంగా విద్యుత్ టవర్లు కూలిపోయి ఉత్తరాది నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు చెప్పారు. తాల్చేరు-కోలార్, అంగుల్-శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో తెలంగాణకు 3 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. కేంద్ర  సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్‌ పూర్తిస్థాయిలో రావడం లేదని, ఉత్పత్తి తగ్గడమే అందుకు కారణమన్నారు.

నిజానికి కేంద్ర సంస్థల నుంచి తెలంగాణకు 2500 మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉందని, కానీ ప్రస్తుతం 1500 మెగావాట్లు మాత్రమే వస్తోందన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లు రావాల్సి ఉండగా 350 మెగావాట్లు మాత్రమే వస్తోందని ప్రభాకర్ రావు వివరించారు. తెలంగాణలోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Titli cyclone
Telangana
Andhra Pradesh
Power cuts
Srikakulam District

More Telugu News