Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు ప్రకృతి సమస్యల కంటే రాజకీయ కుట్రలే తలనొప్పిగా మారాయి!: సీఎం చంద్రబాబు

  • హామీల అమలు అడిగితే ఐటీ దాడులు
  • బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపాటు
  • నీరు-ప్రగతిపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
తిత్లీ తుపాను కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితిని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటామనీ, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ప్రకృతి ప్రకోపం కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

అమరావతిలో ఈ రోజు ‘నీరు-ప్రగతి’ వ్యవసాయంపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి కారణంగా తలెత్తే సమస్యను ధైర్యంగా పరిష్కరించుకుంటున్నామని, రాష్ట్రం విడిపోయి అప్పులపాలైనా ధైర్యంగా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలపై సాగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రానికి ప్రకృతి సమస్యల కంటే రాజకీయ కుట్రలే తలనొప్పిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఏపీని ఇష్టానుసారం విభజించి అప్పుల ఊబిలోకి నెట్టి ఓ పార్టీ (కాంగ్రెస్) ఇబ్బందిపెడితే, ఇప్పుడు కేంద్రంలో ఉన్న మరో పార్టీ (బీజేపీ) ఇంకోరకంగా ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం తాము మాట్లాడితే ఐటీ దాడులతో బెదిరిస్తున్నామని చంద్రబాబు విమర్శించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పట్టుదలతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ఐటీ దాడులతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారని సీఎం ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదనీ, ఇలాంటి ప్రతీకార రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
titli storm
tele conference
amaravati

More Telugu News