Jagan: జగన్, పవన్ కలిస్తే ఏం జరుగుతుందో జోస్యం చెప్పిన లోకేశ్!

  • 150 సీట్లలో గ్యారెంటీగా గెలుస్తాం
  • బీజేపీ కూడా కలిస్తే ప్రభంజనమే
  • జగన్ మాటలకు విలువలేదన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ కు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కలసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తే, టీడీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు కోసం న్యూఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పవన్, జగన్ కలసి పోటీ చేస్తే, టీడీపీకి 150 సీట్లు వస్తాయని అంచనా వేసిన ఆయన, ఇక వారికి బీజేపీ కూడా జతచేరితే 174 సీట్లు వస్తాయని అన్నారు. రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిపితే రెండన్న సూత్రం వర్తించదని చెప్పారు.

తమ అవసరాలు తీర్చుకునేందుకు కలిసేవారిని ప్రజలు ఆదరించరని చెప్పారు. జగన్ మాటలకు విలువలేదని, పవన్ కు తానేం మాట్లాడుతున్నానన్న విషయంలో కనీస అవగాహన కూడా లేదని ఆరోపించిన ఆయన, కేసీఆర్ తన స్థాయిని మరచి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ముందుందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని రకాలుగా అనువైన వాతావరణం ఉందని, అందువల్లే ప్రపంచ ప్రసిద్థి చెందిన కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు.
Jagan
Nara Lokesh
Pawan Kalyan
Elections
Jana Sena
YSRCP
Telugudesam
BJP

More Telugu News