Chandrababu: అనంతపురానికి చంద్రబాబు... కొమరవోలులో భువనేశ్వరి!

  • నేడు బిజీగా గడుపుతున్న చంద్రబాబు దంపతులు
  • అనంతపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు
  • దత్తత గ్రామం కొమరవోలులో భువనేశ్వరి
నేడు చంద్రబాబు దంపతులు బిజీగా గడుపుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన, అటునుంచి అనంత పర్యటనకు వెళ్లారు. నేడు చంద్రబాబు భైరవానితిప్పలో 1,00,001వ పంటకుంటను ప్రారంభించనున్నారు. ఫామ్ పౌండ్ల సంఖ్య లక్ష దాటినందుకు గుర్తుగా పైలాన్ ను ఆవిష్కరిస్తారు. ఆపై రైతులతో సమావేశమయ్యే చంద్రబాబు, మధ్యాహ్న భోజనానంతరం కుందిర్పి బ్రాంచ్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

కాగా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ ఉదయం తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా, పామర్రు మండలం, కొమరవోలులో పర్యటిస్తున్నారు. గ్రామస్థుల సహకారంతో దేవాదాయ శాఖ నిర్మించిన శివాలయంలో కలశాన్ని ఆమె ప్రతిష్ఠించారు. ఆపై పంచాయితీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఆమె, ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆమె పరిశీలించనున్నారు.
Chandrababu
Andhra Pradesh
Anantapur District
Bhuvaneshwari
Komaravolu

More Telugu News