Kadapa District: అక్రమ సంబంధం.. భార్య తలను తెగనరికి పోలీసులకు లొంగిపోయిన భర్త!
- కడప జిల్లా రాయచోటిలో ఘటన
- అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య
- మారాలని హెచ్చరించినా వినకపోవడంతో దారుణం
జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భార్య మోసం చేయడాన్ని ఓ భర్త తట్టుకోలేకపోయాడు. మారాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. దీనికి తోడు కుమారుడిని కూడా భార్యే చంపేసిందన్న అనుమానం భర్తలో బలపడింది. దీంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకుని, భార్య తలను అతి కిరాతకంగా నరికిన భర్త, పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన కడప జిల్లాలోని రాయచోటి మండలం వడ్డెపల్లెలో చోటుచేసుకుంది.
జిల్లాలోని వడ్డెపల్లికి చెందిన వెంకటరమణ(40), రాణి(32) భార్యాభర్తలు. వీరిద్దరికీ 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం రమణ కువైట్ కు వెళ్లాడు. దీంతో పొరుగునే ఉన్న నాగేశ్వరరావుతో రాణికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను మందలించారు. ఆమె భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయినా నచ్చజెప్పి కాపురానికి తిరిగిపంపారు. అయితే ఇద్దరు పిల్లల్లో ఒకరు ఇటీవల చనిపోవడంతో భార్యే ఈ హత్య చేసిందన్న అనుమానం వెంకటరమణలో బలపడింది.
తాను పంపిన డబ్బులకు సరైన లెక్కలు చెప్పకపోవడంతో వెంకటరమణ కువైట్ నుంచి తిరిగివచ్చాడు. అనుమానంతో భార్య కదలికలపై నిఘా పెట్టాడు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం బైక్ పై నాగేశ్వరరావుతో రాణి వెళ్లడాన్ని పసిగట్టిన వెంకటరమణ వారిని వెంబడించాడు. దుద్యాల చెక్ పోస్ట్ వద్ద వారి వాహనాన్ని అడ్డగించాడు. దీంతో రాణిని అక్కడే వదిలిన ప్రియుడు పరారయ్యాడు. భార్య తనను మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయిన వెంకటరమణ భార్యను పంటపొలాల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం దారుణంగా గొంతుకోసి హతమార్చాడు. తలను తెగ్గోసి 10 కి.మీ దూరంలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.