Jammu And Kashmir: జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం.. 200 అడుగు లోయలోపడిన మినీ బస్సు

  • 22 మంది ప్రయాణికుల దుర్మరణం
  • 14 మందికి తీవ్రగాయాలు
  • రంబన్‌ నుంచి బనిహల్‌కు వెళ్తుండగా ఘటన
కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు ప్రమాదవశాత్తు 200 అడుగుల లోతున్న లోయలో పడిపోవడంతో 22 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము- కశ్మీర్‌ రాష్ట్రం రంబన్‌ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం శనివారం జరిగింది. ఉదయం 9.55 గంటల సమయంలో రంబన్‌ నుంచి బనిహల్‌కు బయలుదేరిన ఓ మినీ బస్సు జమ్ము- శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది.

మారూఫ్‌ సమీపంలోని కేళా మోల్‌ వద్ద బస్సు అదుపుతప్పి 200 అడుగు లోతున్న లోయలోకి దూసుకుపోయింది. ఘటన సమయానికి బస్సులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో బస్సు డ్రైవర్‌తోపాటు నలుగురు మహిళలు ఉన్నారు.

సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సైన్యం సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన పది మందిని హెలికాప్టర్‌లో ఉదంపూర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని జమ్ములోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరు ఆర్మీ హెలికాప్టర్‌లు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు హెలికాప్టర్‌ ఒక్కొక్కటీ చొప్పున మొత్తం 8 హెలికాప్టర్‌లు సేవలందిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.
Jammu And Kashmir
Road Accident

More Telugu News