Telangana: తెలంగాణ లాయర్లకు షాక్.. రోస్టర్ ప్రకారమే హైకోర్టులో నియామకాలు చేపట్టాలన్న సుప్రీం!

  • రోస్టర్ విధానాన్ని పాటించాలని ఆదేశం
  • స్థానికత ఆధారంగా కుదరదని స్పష్టీకరణ
  • 2015లో సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ లాయర్లు
ఉమ్మడి హైకోర్టులో తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలను స్థానికత ఆధారంగా విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రోస్టర్ విధానంలోనే నియామకాలు చేపట్టాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది. గతంలో హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే రోస్టర్ విధానంలో నియామకాలు చేపట్టాలని సూచించింది.

హైకోర్టులో జడ్జీలుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నందున విభజనలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీంలో 2015లో పిటిషన్ దాఖలు చేసింది. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే తెలంగాణ న్యాయాధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఉమ్మడి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీనియారిటీ ప్రాతిపదికన జడ్జీల విభజన చేపడితే తెలంగాణ జడ్జీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదించారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే 371 (డి)ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం తరఫు లాయర్లు స్పందిస్తూ..371 (డి) న్యాయ శాఖకు వర్తించదనీ, ఈ పోస్టులకు దేశంలో ఎవరైనా పోటీ పడొచ్చని తేల్చిచెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం, రోస్టర్ విధానంలోనే జడ్జీల నియామకాలు చేపట్టాలని తేల్చిచెప్పింది.
Telangana
lawyers
roster
local status
High Court
Andhra Pradesh
lawyers association
judges
appointment

More Telugu News