Udayasimha: పోలీసుల చేతికి రేవంత్ రెడ్డి లావాదేవీల హార్డ్ డిస్క్?

  • రణధీర్ రెడ్డి ఇంట హార్డ్ డిస్క్
  • స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్
  • ఉదయసింహ దగ్గరి బంధువే రణధీర్
రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఓ హార్డ్ డిస్క్ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ హార్డ్ డిస్కులో రేవంత్ రెడ్డి జరిపిన పలు లావాదేవీల వివరాలు ఉన్నాయని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయ్ సింహ బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఇది టాస్క్ ఫోర్స్ పోలీసులకు లభ్యమైనట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమని చెబుతూ వచ్చి, ఆయన ఇంట్లో సోదాలు చేసిన వారు, నిన్నంతా రణధీర్ ను అదుపులో ఉంచుకుని గత రాత్రి 12 గంటల సమయంలో ఆయన్ను ఇంటి వద్ద వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ విషయమై నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన రణధీర్, ఉదయ సింహ ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలో తనకు ఓ కవర్ ఇచ్చారని, అందులో హార్డ్ డిస్క్, ఓ బ్యాంకు తాళం ఉన్నాయని, అవే పోలీసులు తీసుకెళ్లారని చెప్పాడు. ఇవి రేవంత్ కు సంబంధించినవి కావని, మిగతా వివరాలు పోలీసులే స్వయంగా చెబుతారని అన్నారు. పోలీసులు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు ఇచ్చారని, అయితే, వాటిని స్టేషన్ లోనే మరచిపోయి వచ్చానని అన్నారు.

కాగా, సదరు హార్డ్ డిస్క్ లో ఏముందన్న కోణంలో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. దాన్ని తెరచి, అందులో ఉన్న వివరాలను విశ్లేషించే పనిలో ఉన్నారు.
Udayasimha
Revanth Reddy
Ranadheer

More Telugu News