Aravind kejriwal: హిందువుల ప్రయోజనాలు కాపాడడంలో బీజేపీ విఫలం!: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌

  • ఆపిల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ వివేక్‌ తివారీ కాల్చివేతపై తీవ్రంగా స్పందన
  • ఘటనపై సరైన రీతిలో విచారణ సాగుతుందన్న నమ్మకం లేదని వ్యాఖ్య
  • సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ కూడా విమర్శలు

హిందువుల ప్రయోజనాలను కాపాడడంలో బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమవుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గోమతినగర్‌ ప్రాంతంలో కారులో వెళ్తున్న ఆపిల్‌ సేల్స్‌ మేనేజర్‌ వివేక్‌ తివారీని పోలీసులు కాల్చిచంపారు. తనిఖీలు చేస్తున్న తాము కారు ఆపినా ఆపకపోవడమేకాక తమ బైక్‌ను ఢీకొట్టి వెళ్లడంతో ప్రమాదాన్ని ఊహించి ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపినట్లు బాధ్యులైన పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పోలీసుల చర్యపై ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సరైన రీతిలో విచారణ జరిపిస్తుందా’ అన్న ట్వీట్‌కు కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘విచారణ సవ్యంగా జరుగుతుందని అనుకోవడం లేదు. వివేక్‌ తివారీ హిందువేకదా... అయినప్పటికీ ఆయన ప్రయోజనాలు బీజేపీ కాపాడలేకపోయింది’ అని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. ఇటువంటి ఘటనలపై సింగిల్‌ జడ్జితో విచారణ జరిపించనంతకాలం నకిలీ ఎన్‌కౌంటర్ల నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు.

More Telugu News