Chinthamaneni Prabhakar: చిరంజీవి ఏదో శ్రీరామ చంద్రుడైనట్టు పోజులిస్తున్నావ్!: పవన్ కల్యాణ్ పై చింతమనేని ఫైర్

  • దెందులూరు సభలో పది పేపర్లు తిరగేసి ఏం పొడిచారు?
  • ప్రజారాజ్యం నుంచి పరకాల ప్రభాకర్ ను వెళ్లగొట్టారు
  • అదే పేరు ఉన్న నాపై ఇప్పుడు గురి పెట్టారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్టుగా నటించినట్టే... దెందులూరు సభలో పది పేపర్లు తిరగేసి చదివారు. మీ పేపర్లలో ఉన్న మ్యాటర్ తో ఏం పొడిచారు?' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసత్య ఆరోపణలు చేయడం తప్ప పవన్ చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపితే శాశ్వతంగా రాజకీయాలను వదిలేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు.

మీ అన్నగారు చిరంజీవి గురించి ఒక్క మాట కూడా మాట్లాడవని.. ఆయనేదో పెద్ద శ్రీరామ చంద్రుడు అయినట్టు పోజులిస్తున్నావంటూ పవన్ పై ప్రభాకర్ మండిపడ్డారు. తమ సామాజిక వర్గానికి ఏదో చేస్తాడనే ఆశతో కాపు సామాజికవర్గం మీ అన్నకు మద్దతు పలికితే... గంపగుత్తగా పార్టీనంతా తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశారని విమర్శించారు. తనపై విమర్శలు గుప్పించేంత స్థాయి పవన్ ది కాదని... మోదీ లాంటి వ్యక్తులను విమర్శించేంత పెద్ద స్థాయి అతనిదని ప్రభాకర్ చెప్పారు. ఒక ఎమ్మెల్యే స్థాయికి దిగజారి మాట్లాడటం ఒక పార్టీ అధినేతకు తగదని హితవు పలికారు.

పవన్ కల్యాణ్ కు ప్రభాకర్ అనే పేరంటేనే గిట్టదేమో అని చింతమనేని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పరకాల ప్రభాకర్ వెళ్లిపోయేలా చేశారని... ఇప్పుడు అదే పేరు వున్న తనపై గురి పెట్టారని... చంద్రబాబు మళ్లీ తనకు టికెట్ ఇవ్వకుండా ఉండాలనే కోరిక పవన్ కు ఉందేమో అంటూ సెటైర్ వేశారు. ఒకవేళ దెందులూరులో గెలవాలనే కోరిక మీకు ఉంటే టీడీపీలో చేరాలని... తన భుజాలపై నిలబెట్టి మిమ్మల్ని గెలిపిస్తానని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంత మెజార్టీతో గెలిపిస్తానని తెలిపారు.
Chinthamaneni Prabhakar
parakala prabhakar
Pawan Kalyan
Chiranjeevi
prajarajyam
Telugudesam
Chandrababu
denduluru
janasena

More Telugu News