దేశ ప్రధానిని.. నా ఫోన్ కాల్స్ కూడా కట్ అవుతున్నాయి!: టెలికాం అధికారులతో ప్రధాని మోదీ
- గతంలో పలుమార్లు కట్ అయ్యాయని వెల్లడి
- జరిమానా వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ
- కాల్ డ్రాప్ లను నియంత్రించాలని ఆదేశం
ప్రభుత్వ పథకాలను సమీక్షించడంలో భాగంగా మోదీ ఉన్నతాధికారులతో తరచూ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతూ ఉంటారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో టెలికాం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రధానికి వివరించారు. వీటిలో కాల్ డ్రాప్స్ కూడా ఉన్నాయని చెప్పారు. దీంతో తనకు కూడా ఈ సమస్య ఎదురైందనీ, తాను ఫోన్ లో మాట్లాడుతుండగా గతంలో పలుమార్లు కాల్స్ కట్ అయిపోయాయని మోదీ తెలిపారు.
అనంతరం ఇలా ఫోన్ కాల్ అకారణంగా కట్ అయిపోతే ఆపరేటర్ల నుంచి ఎంత జరిమానాను వసూలు చేస్తున్నారని మోదీ ప్రశ్నించారు. దీంతో ప్రతి 3 కాల్ డ్రాప్ప్ కు రూ.1 జరిమానా విధిస్తున్నట్లు అధికారులు ప్రధానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.