Rahul Gandhi: రాఫెల్‌పై ఇది ఆరంభం మాత్రమే...అసలు గుట్టు త్వరలో బయటపెడతాం : రాహుల్‌గాంధీ

  • మాటల తీవ్రత పెంచిన కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌
  • బీజేపీ ప్రభుత్వం వల్ల హాల్‌కు తీవ్ర నష్టం
  • మాల్యా దేశం విడిచి పారిపోవడం వెనుక అంశాలు వెల్లడిస్తాం
వివాదాస్పన రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ స్వరం పెంచారు. ‘ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మేము బయటపెట్టిన అంశాలు ఆరంభం మాత్రమే. త్వరలో మొత్తం గుట్టు రట్టు చేస్తాం. దీంతోపాటు ఆర్థిక నేరగాడు మాల్యా దేశం విడిచి పారిపోవడం వెనకున్న అసలు కథను వెల్లడిస్తాం’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సొంత నియోజకవర్గం అమేథిలో రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)ను కాదని డసాల్ట్‌తో రిలయన్స్‌ డిఫెన్స్‌ జతకలిసేలా అడ్డగోలు ఒప్పందాన్ని కుదిర్చారని, ఇందులో అనిల్‌ అంబానీకి మేలుచేసే ఉద్దేశం ఉందని ఆయన ఆరోపించారు. మిగ్‌, సుకోయ్‌, జాగ్వార్‌ తయారీలో 70 ఏళ్ల అనుభవం ఉన్న హాల్‌ను కాదని రిలయన్స్‌కు పెద్దపీట వేయడం వల్ల హాల్‌ ఎంతో నష్టపోయిందని, అవకాశం దక్కకుండా చేసింది బీజేపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.

'ఒప్పందానికి పదిరోజుల ముందే  రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత అన్నీ చకాచకా జరిగిపోయాయి, దీని వెనుకున్న మతలబును త్వరలోనే బయటపెడతాం' అని రాహుల్‌ తెలిపారు. ‘దేశానికి సేవలందించే సైనికులారా, అమర వీరుల కుటుంబాల్లారా, హాల్‌ సంస్థ ప్రతినిధులారా...బీజేపీ ప్రభుత్వం తీరుతో మీరెంత రగిలిపోతున్నారో తెలుసు. త్వరలోనే బాధ్యులను చట్టం ముందు నిలబెడతాం’ అంటూ రాహుల్‌ అనంతరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Rahul Gandhi
Rafel
BJP

More Telugu News