nirmala seetharaman: ఆత్మరక్షణలో నిర్మలా సీతారామన్.. ఫ్రెంచి జర్నలిస్టులను బయటకెళ్లాలని కోరిన వైనం!

  • కేంద్ర ప్రభుత్వాన్ని సతమతం చేస్తున్న రాఫెల్ ఒప్పందం
  • మీడియా ప్రశ్నలకు సమాధానాలను దాటవేస్తున్న రక్షణ మంత్రి
  • కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందన్న విశ్లేషకులు
రాఫెల్ ఒప్పందం మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. విపక్షాల ముప్పేట దాడితో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ముఖ్యంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మరక్షణలో పడిపోయారు. రాఫెల్ ఒప్పందంపై మీడియా ప్రశ్నలకు కూడా ఆమె సమాధానాలు చెప్పలేకపోతున్నారు. నిన్న మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో కూడా ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ఈ సమావేశానికి 30 మంది మీడియా ప్రతినిధులు హాజరు కాగా... వీరిలో కొందరు విదేశీ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఫ్రెంచి జర్నలిస్టులను సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆమె కోరారు.

ఈ నేపథ్యంలో ఓ సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ, ఫ్రెంచ్ జర్నలిస్టులను నిర్మల బయటకు వెళ్లిపోవాలని కోరడంతో తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు. ఈ అంశం ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాఫెల్ ఒప్పందంపై ఓవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే... జర్నలిస్టుల సందేహాలను కూడా కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయలేకపోతోందని... కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు. 
nirmala seetharaman
rafel

More Telugu News