kavitha: చంద్రబాబు నిర్ణయం వెనుక ఏదో పొలిటికల్ గేమ్ కచ్చితంగా వుంటుంది!: కవిత

  • టీఆర్ఎస్ తో కలసి పని చేసేందుకు చంద్రబాబు ఎప్పుడు యత్నించారో నాకు తెలియదు
  • ఆంధ్ర పార్టీ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకూడదనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు
  • కేసీఆర్ త్వరగా ప్రచారం రంగంలోకి దిగాలని మేమంతా కోరుకుంటున్నాం
టీఆర్ఎస్ తో కలసి పని చేయడానికి టీడీపీ ఆసక్తిగా ఉన్నా ప్రధాని మోదీ పడనీయలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పందించారు. వాస్తవానికి దీనికి సమాధానం చెప్పే విషయం తన పరిధిలో లేదని ఆమె అన్నారు. టీఆర్ఎస్ తో కలసి పని చేసేందుకు చంద్రబాబు ఎప్పుడు ప్రయత్నించారో కూడా తనకు తెలియదని చెప్పారు.

టీఆర్ఎస్ తో పొత్తును ఎవరో ఆపితేనో, వద్దంటేనో చంద్రబాబు అమాయకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని తాను భావించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు నిర్ణయం వెనుక కచ్చితంగా ఏదో పొలిటికల్ గేమ్ ఉంటుందని ఆమె చెప్పారు. కాకపోతే ఆంధ్ర పార్టీ అయిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకూడదనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 9 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించే లక్ష్యంతోనే తాను పని చేస్తున్నానని కవిత అన్నారు. లోక్ సభ నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను స్వీకరించానని చెప్పారు. కేసీఆర్ వీలైనంత త్వరగా ప్రచార రంగంలోకి దిగాలని తామంతా కోరుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడు వస్తారా? అనే ఆత్రుత ప్రజల్లో కూడా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని తాను స్వయంగా గమనించానని తెలిపారు.
kavitha
kcr
Chandrababu
congress
Telugudesam
TRS

More Telugu News