araku: అరకు లేదా విశాఖలో ఎక్కడైనా శవపంచనామా నిర్వహించే అవకాశం ఉంది: విశాఖ కలెక్టర్ ప్రవీణ్

  • సర్వేశ్వరరావు కుటుంబసభ్యులకు పరామర్శ
  • అరకుకు మహాప్రస్థానం వాహనాల్లో ఫ్రీజర్లు పంపించాం
  • అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తే అక్కడే శవపంచనామా
మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ భౌతికకాయాలకు శవపంచనామాపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ తెలిపారు. స్థానిక ఎంవీపీ కాలనీలో సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను ప్రవీణ్, డీసీపీ ఫకీరప్ప పరామర్శించారు. అనంతరం, మీడియాతో ప్రవీణ్ మాట్లాడుతూ, అరకు లేదా విశాఖలో ఎక్కడైనా శవపంచనామా నిర్వహించే అవకాశం ఉందని, కుటుంబసభ్యుల అభిప్రాయం మేరకు అంత్యక్రియలపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

విశాఖ నుంచి అరకుకు మహాప్రస్థానం వాహనాల్లో ఫ్రీజర్లు పంపించామని, వారి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తే అక్కడే శవపంచనామా జరిగేలా ఏర్పాట్లు చేస్తామని ప్రవీణ్ పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే హత్యతో అరకు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, సర్వేశ్వరరావు, సోమ మృతి పట్ల గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
araku
mla surveswara rao

More Telugu News