karunool: అవుకు సొరంగం ప్రారంభం.. కడపకు నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- కర్నూలులో 3 ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించాం
- రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
- కడప జిల్లాలో చివరి ఆయకట్టుకూ నీళ్లిస్తాం
కర్నూలు జిల్లాలోని అవుకు సొరంగాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించి.. కడపకు నీటిని విడుదల చేశారు. గోరుకల్లు జలాశయం, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన చంద్రబాబు, ఇస్కాల ఎత్తిపోతల బృహత్తర పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో మూడు ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించి జాతికి అంకితం చేశామని, రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ఎడారి కాకుండా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రతి ఎకరాకు నీరందించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని, గండికోట నుంచి చిత్రావతి ద్వారా కడప జిల్లాలో చివరి ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులను చేపట్టామని, ఇప్పటికే 15 ప్రాజెక్టులు పూర్తి చేశామని, త్వరలో మరో 29 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. వంశధార, నాగావళి, కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానిస్తామని, ఓర్వకల్లును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, కొలిమిగుండ్లను సిమెంట్ పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దుతామని, అవసరమైతే, కొలిమిగుండ్లలో రైల్వేలైన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని అన్నారు. కొలిమిగుండ్ల, అవుకు, బేతంచర్లలో నాపరాయి రాయల్టీని తగ్గించిన విషయాన్ని ప్రస్తావించారు.