East Godavari District: బలి తీసుకున్న బాణసంచా.. రాజమహేంద్రవరంలో ముగ్గురు సజీవ దహనం!

  • లాలాచెరువు సుబ్బారావుపేటలో దారుణం
  • పూరి గుడిసెలో అక్రమంగా టపాసుల తయారీ
  • షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ప్రమాదం
తూర్పుగోదావరిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం కోసం బాణసంచా తయారుచేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజమహేంద్రవరంలోని లాలాచెరువు సుబ్బారావుపేటలో నిన్నఅర్ధరాత్రి చోటుచేసుకుంది.

వినాయక నిమజ్జనం కోసం ఆర్డర్ రావడంతో ఓ కుటుంబం ఓ పూరి గుడిసెలో అక్రమంగా బాణసంచా తయారీని మొదలుపెట్టింది. దీని తయారీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. శుక్రవారం రాత్రి వర్షం పడటంతో విద్యుత్ ఫ్లగ్ ను బోర్డులో పెట్టగానే షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో టపాసులు తయారుచేస్తున్న దేవాడ సుబ్బలక్ష్మి, సూర్యకాంతం, వినయ్ రెడ్డిలు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు సంభవించడంతో మేల్కొన్న స్థానికులు నీళ్లు చల్లి కాపాడేందుకు యత్నించినా వీలుకాలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

కాగా ముత్యాల రెడ్డి అనే వ్యక్తి పేరుమీద ఈ ఇల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వీరు బాణసంచాను తయారుచేస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ముత్యాల రెడ్డి భార్య సుబ్బలక్ష్మి, అత్త సూర్యకాంతం, చిన్న కుమారుడు విధేయ్ లు సజీవ దహనం అయ్యారని చెప్పారు. ముత్యాల రెడ్డి, ఆయన పెద్ద కుమారుడితో పాటు మరొకరు గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
East Godavari District
Fire Accident

More Telugu News