Tanzania: టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం.. 131 మంది జలసమాధి!

  • తీరానికి 50 మీటర్ల దూరంలో పడవ మునక
  • సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు
  • ఇప్పటి వరకు 131 మృతదేహాలు వెలికితీత
ఏం కాదులే అన్న నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణమైంది. 131మంది ప్రాణాలను బలిగొంది. వంద మంది ఎక్కాల్సిన పడవలో 200 మంది ప్రయాణికులు, సిమెంటు బస్తాలు, అరటి గెలలు, మొక్కజొన్న బస్తాలు ఎక్కించడంతో బరువుకు అదుపు తప్పిన పడవ మునిగిపోయింది. టాంజానియాలో జరిగిందీ ఘటన. మొత్తం 131 మంది మృతదేహాలను వెలికి తీసినట్టు ఆ దేశ రవాణా మంత్రి ఇసాక్ కమ్వెల్ తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

బుగొలొరా పట్టణంలో జరిగిన సంతకు వెళ్లిన బాధితులు తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ఘటన జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇతర సామగ్రి కూడా ఉండడంతో బోటులోని బరువంతా ఒక పక్కకు చేరింది. ఫలితంగా పడవ మునిగిపోయింది. తీరానికి 50 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిజానికి పడవలో ఎంతమంది ఎక్కారన్న విషయంలో రికార్డులు లేకపోవడంతో గల్లంతు అయిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. అయితే, 200 మందికి పైనే ఉన్నారని స్థానిక వార్తా పత్రిక తెలిపింది. కాగా, మృతులకు నివాళిగా టాంజనియా ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
Tanzania
Boat
capsize
Lake Victoria ferry
disaster

More Telugu News