miryalaguda: అమృతను ఓదార్చిన తమిళనాడు పరువు హత్య బాధితురాలు కౌసల్య!

  • అమృతను కలిసి ధైర్యం చెప్పిన కౌసల్య
  • ప్రణయ్ హత్య జరిగిన తీరుపై ఆరా
  • తన భర్త హత్యకు కారణం ‘కులమే’ అన్న కౌసల్య

తెలంగాణలోని మిర్యాలగూడలో ఇటీవల జరిగిన పరువు హత్య ఘటన సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ప్రణయ్ ప్రాణాలు కోల్పోవడంతో అతని భార్య అమృత బాధ వర్ణనాతీతం. అమృతను ఓదారుస్తూ, ఆమెకు ధైర్యం చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం తమిళనాడులో పరువు హత్య ఘటనలో తన భర్తను పోగొట్టుకున్న కౌసల్య మిర్యాలగూడకు వచ్చి ఓదార్చారు. అమృతను ఈరోజు ఆమె కలిసి ఓదార్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రణయ్ హత్య జరిగిన తీరుపై ఆమె ఆరా తీశారు. 2016లో తన భర్త శంకర్ పరువు హత్యకు గురైన ఘటనకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా అమృతకు ఆమె చూపించారు.

శంకర్ హత్య కేసులో ఎంతమంది నిందితులకు శిక్ష పడిన విషయాన్ని అమృత అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అసలు, శంకర్ హత్యకు కారణమేంటని అమృత ప్రశ్నించగా, ‘కులమే’ అని కౌసల్య సమాధానమిచ్చారు. తన భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ రాకూడదని బలంగా కోరుకుంటున్నానని, నిందితులు బయటకొస్తే, తనకు, పుట్టబోయే బిడ్డకు హాని తలపెడతారేమోనని అమృత అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

కాగా, దేవర్ కులానికి చెందిన కౌసల్య, దళిత ఎస్సీ వర్గానికి చెందిన శంకర్ ప్రేమ వివాహం చేసుకోవడంతో శంకర్ ను కౌసల్య తరఫువారు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు కౌసల్య తండ్రి సహా ఆరుగురికి మరణశిక్ష విధించగా, ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణలో వుంది.  

More Telugu News