KCR: అమృత వర్షిణికి అసెంబ్లీ టికెట్... నిలిపితే ఏకగ్రీవం చేస్తామన్న తమ్మినేని, ఐలయ్య!

  • అమృతను ఓదార్చిన తమ్మినేని వీరభద్రం, కంచె ఐలయ్య
  • చట్టసభకు పంపేందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలి
  • హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ భార్య అమృత వర్షిణిని ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని సీపీఎం, టీ-మాస్ ప్రతిపాదించాయి. ప్రణయ్ నివాసంలో అమృతను కలిసి ఓదార్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ-మాస్‌ చైర్మన్‌ కంచె ఐలయ్యలు, ఆమెను పోటీకి నిలిపితే ఏకగ్రీవం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చొరవ చూపితే స్వాగతిస్తామని అన్నారు. కుల దురహంకారానికి బలైన ప్రణయ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రణయ్ పై దాడి ఘటనపై కేసీఆర్ స్పందించలేదని, హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డిల్లో ఎవ్వరూ పరామర్శించడానికి రాలేదని వారు ఆరోపించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న  కాంగ్రెస్‌ నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని, కానీ నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్‌ చేయలేదదని వారు ప్రశ్నించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలయ్య డిమాండ్‌ చేశారు.
KCR
Amrutha
Tammineni
Kanche Ilayya

More Telugu News