suresh reddy: కేసీఆర్ కోరినప్పుడు.. ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది: సురేష్ రెడ్డి

  • రాష్ట్ర  అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేసీఆర్ నన్ను ఆహ్వానించారు 
  • కేసీఆర్ కు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది
  • కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఆహ్వానించారని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అన్నారు. సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయే సమయంలో... తనతో పాటు కలసి రావాలని పెద్దలు కేసీఆర్ పిలవడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఆయన చెప్పారు. భవిష్యత్ తరాల మంచి కోసమే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని తెలిపారు. కాసేపటి క్రితం సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించారు.

కేసీఆర్ తో తనకు 1989 నుంచి పరిచయం ఉందని సురేష్ రెడ్డి తెలిపారు. తామిద్దరం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ... ఆయన ఎప్పుడూ తనకు స్ఫూర్తి దాతగానే ఉన్నారని చెప్పారు. ఆయన ఆలోచనలు తనను ఎప్పుడూ ఆకట్టుకునేవని గుర్తు చేసుకున్నారు. గత నాలుగేళ్ల కాలంలో కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని కొనియాడారు. రాష్ట్ర పురోగతిలో భాగస్వామ్యం కావాలని కేసీఆర్ కోరినప్పుడు... ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
suresh reddy
kcr
TRS
join

More Telugu News