Ayyanna Patrudu: మంత్రి యనమలతో మరో మంత్రి అయ్యన్న వాగ్వివాదం.. భేటీ నుంచి రుసరుసా బయటకు!

  • రోడ్ల నిర్మాణ నిధుల విషయంలో అసంతృప్తి
  • యనమల బుజ్జగించినా ఫలితం శూన్యం
  • సమావేశం నుంచి వెళ్లిపోయిన అయ్యన్న 
రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదంటూ గత కొన్ని రోజులుగా ఆర్థికశాఖపై ఆగ్రహంతో ఉన్న ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో వాగ్వివాదానికి దిగి భేటీ నుంచి అలిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తనను ఏ పనీ చేయనివ్వడం లేదని, ఆ మాత్రానికి మంత్రిగా ఉండి ఏం లాభమని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. యనమల సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ భేటీ నుంచి ఆయన రుసరుసా బయటకు వెళ్లిపోయారు.

సచివాలయంలో ఇటీవల ఆర్‌అండ్‌బీ, ఆర్థిక శాఖల సమావేశం జరిగింది. ఇందులో రోడ్ల అభివృద్ధి, విస్తరణపై చర్చించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన డిమాండ్లపైనా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రహదారి నిర్మాణ హామీల అమలు కోసం రూ.2,700 కోట్లతో ఆర్ అండ్ బీ పంపిన ప్రతిపాదనలపైనా చర్చించారు. అయితే, అంతమొత్తం ఇవ్వలేమని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఆ ఫైలును వెనక్కి పంపటంతో వివాదం రాజుకుంది.

సమస్య పరిష్కారానికి రెండు శాఖల మధ్య సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ఆర్థిక శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొర్రీలు వేయడం సరికాదని, రెగ్యులర్‌గా ఇచ్చే నిధులను కూడా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. దీంతో యనమల కల్పించుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలిసీ అలా మాట్లాడడం సరికాదని, కొన్ని ప్రతిపాదనలు పునస్సమీక్షించుకోవాలని, ఉన్న నిధులతోనే సరిపెట్టుకోవాలని సూచించారు.

దీనికి స్పందించిన అయ్యన్నపాత్రుడు.. ఏ పనీ చేయలేనప్పుడు మంత్రిగా ఉండి ఏం లాభమని, ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. యనమల ఆయనను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినిపించుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.
Ayyanna Patrudu
Yanamala
Andhra Pradesh
Chandrababu

More Telugu News