Telugudesam: వీధినపడి కొట్టుకున్న తెలుగుదేశం నేతలు.. పోలీస్ పికెట్ ఏర్పాటు చేసిన అధికారులు!

  • ఒంగోలు జిల్లాలో ఘటన
  • పాత గొడవల నేపథ్యంలో దాడి
  • పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఇరువర్గాలు
ఒంగోలు జిల్లాలో తెలుగుదేశం నేతలు బాహాబాహీకి దిగారు. గతంలో పెట్టుకున్న కేసుల విషయంలో గొడవ జరగడంతో ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడిచేసి గాయపరచుకున్నారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు.

ఒంగోలు జిల్లాలోని ఉప్పుగుండూరులో టీడీపీ నేతలు సింగు రాజా నరసింహారావు, నల్లారి రాజాకు మధ్య గతంలో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ లైబ్రరీ వద్ద నిన్న వీరిద్దరికీ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన రాజా ‘నా మీదే పోలీస్ కేసులు పెడతావా?’ అంటూ దాడికి దిగాడు.

దీంతో అక్కడే ఉన్న స్థానికులు వీరిద్దరినీ వారించి పక్కకు పంపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నరసింహారావు బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని నల్లారి రాజాపై దాడి చేశారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రాజాను రిమ్స్ కు తరలించారు.

గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. రాజా, నరసింహారావు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించినట్లు ఇన్ చార్జ్ ఎస్సై  సురేశ్ తెలిపారు.
Telugudesam
ongole
Prakasam District
street fight

More Telugu News