Bengal: హోటల్‌లో ఉరివేసుకుని మరణించిన బెంగాలీ నటి!

  • సిలిగురి హోటల్‌లో ఆత్మహత్య 
  • భర్త నుంచి విడాకులు తీసుకున్న పాయల్
  • షాక్‌లో బెంగాలీ చిత్ర పరిశ్రమ
బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి  పాయల్ చక్రవర్తి (36) ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకుంది. గ్యాంగ్‌టక్ వెళ్లేందుకని మంగళవారం సిలిగురి వచ్చి ఓ హోటల్‌ రూమ్‌ను పాయల్ బుక్ చేసుకుంది. తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని హోటల్ సిబ్బందికి ముందే చెప్పింది. మంగళవారం రాత్రి భోజనం కూడా చేయలేదు. అయితే, బుధవారం బారెడు పొద్దెక్కినా ఆమె బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఆమె గది తలుపు తట్టారు.

ఎంతసేపటికీ లోపలి నుంచి స్పందన రాకపోవడంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లిన సిబ్బంది, అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యారు. ఫ్యాన్‌కు వేలాడుతూ పాయల్ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. పాయల్ ఆత్మహత్య విషయం తెలిసి బెంగాలీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటీవల భర్త నుంచి విడాకులు తీసుకున్న పాయల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పాయల్ మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Bengal
TV actress
Payel Chakraborty
dead
Siliguri
suicide

More Telugu News