Andhra Pradesh: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక: ఏపీ అటవీశాఖ మంత్రి

  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎర్రచందనాన్ని పరిరక్షిస్తాం 
  • అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు
  • బడా స్మగ్లర్లను త్వరలోనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడతాం
ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఏపీ అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. చెక్ పోస్టులను పటిష్టం చేయడంతో పాటుగా డ్రోన్లు, సీసీటీవీల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎర్రచందనాన్ని పరిరక్షించనున్నట్లు తెలిపారు. అటవీప్రాంతంలోకి అనుమతులు లేకుండా ప్రవేశించి, అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజంపేట ఉదంతంపై మంత్రి స్పందిస్తూ ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. తమిళ కూలీలను శేషాచలం అడవుల్లోకి చొప్పిస్తూ, తెరవెనుక ఉండి వారితో ఎర్రచందనం చెట్లను నరికిస్తున్న బడా స్మగ్లర్లను త్వరలోనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడతామన్నారు. పోలీస్ మరియు అటవీశాఖ అధికారుల సంయుక్త ఎన్ ఫోర్స్ మెంట్ తో విలువైన ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

2014 నుండి ఆగస్టు 2018 వరకు 4,712 కేసులు నమోదు చేసి 14,144 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, 2380.7045 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం, 3,356 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు అందజేయనున్నట్లు మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు.
Andhra Pradesh

More Telugu News