'నేను చనిపోతున్నా... అంత్యక్రియలకు పవన్ రావాలి' అంటూ వీరాభిమాని ఆత్మహత్య!
గత కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్న జనసేన కార్యకర్త, పవన్ కల్యాణ్ వీరాభిమాని కొమరవల్లి అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన అనిల్ కుమార్, తల్వాల్కర్స్ జిమ్ లో ట్రయినర్ గా పని చేస్తున్నాడు. గతంలో జనసేన నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో కార్యకర్తగా సేవలందించాడు. చనిపోయే ముందు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఓ లేఖ రాసిన అనిల్ కుమార్, తన మరణాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని కోరాడు. తాను చనిపోయిన తరువాత, చూసేందుకు పవన్ రావాలని, ఆయన చేతుల మీదుగానే తన అంత్యక్రియలు జరగాలని కోరుకున్నాడు. పవన్ తప్పకుండా వస్తారనే భావిస్తున్నట్టు లేఖలో రాసుకున్నాడు. అనిల్ కుమార్ ఆత్మహత్యతో విజయవాడలోని అతని కుటుంబీకులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.