gold: ఉద్యోగమిచ్చి ఆదుకుంటే కిలో బంగారంతో పరారైన ఉద్యోగి!

  • నెల రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన యువకుడు
  • కిలో నగలతో పరారీ
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ నగల దుకాణంలో పనిచేసే ఉద్యోగి ఒకరు కేజీ బంగారంతో పరారయ్యాడు. నెల రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన అతడు.. యజమానిని దారుణంగా మోసగించాడు. పోలీసుల కథనం ప్రకారం.. అశోక్ సింగ్ అనే వ్యక్తి అమీర్‌పేటలో మనోహర్ జ్యూయలర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం రాజస్థాన్‌కు చెందిన వీరేందర్ అనే యువకుడిని సేల్స్‌మన్‌గా చేర్చుకున్నాడు. కొన్ని రోజుల్లోనే యజమాని విశ్వాసాన్ని చూరగొన్న యువకుడు అతడికి దగ్గరయ్యాడు. నమ్మకంగా మెలిగాడు.

అదును కోసం ఎదురుచూస్తున్న వీరేందర్‌కు సోమవారం కలిసొచ్చింది. తోటి ఉద్యోగి సెలవు పెట్టాడు. యజమానికి బదులుగా ఆయన కుమారుడు దుకాణానికి వచ్చాడు. దాంతో వీరేందర్ తన ఆలోచనను అమలు చేశాడు. దొరికిన నగలను దొరికినట్టు తన జేబులో వేసుకున్న నిందితుడు మూత్ర విసర్జన కోసం వెళుతున్నట్టు చెప్పి పరారయ్యాడు. బయటకు వెళ్లిన వీరేందర్ ఎంతకూ షాపుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని షాపులో పరిశీలించగా దాదాపు కిలోబంగారం నగలు కనిపించలేదు. అశోక్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
gold
ornaments
Hyderabad
Ameerpet
Telangana

More Telugu News