Nalgonda District: జూనియర్ ఎన్టీఆర్, నానీ, ప్రణీత... ప్రముఖులెవరికీ అచ్చిరాని నల్గొండ రోడ్లు... మృతులు, అదృష్టవంతుల వివరాలు!

  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు ఫ్రధాన రహదారులు
  • చిట్యాల, నార్కట్ పల్లి మోస్ట్ డేంజరస్
  • ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న ప్రమాదకర మలుపులు
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి... నార్కట్ పల్లి నుంచి అద్దంకి వరకూ వేసిన రోడ్డు... సూర్యాపేట నుంచి విజయవాడను తాకకుండా కోల్ కతా - చెన్నై జాతీయ రహదారిని తాకే రోడ్డు... వీటన్నింటికీ కామన్ ఒకటే... ఇవి ఉమ్మడి నల్గొండ జిల్లా గుండా వెళతాయి. ఎందుకోగానీ, మరే జిల్లాలో జరగనన్ని రహదారి ప్రమాదాలు, ఈ జిల్లాలోనే జరుగుతున్నాయి. గతంలో ఎంతో మంది ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా హరికృష్ణ మృతితో నల్గొండ రహదారులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఈ జిల్లా రోడ్లపై జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే...

2006లో చిట్యాల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దంపతులు వేమవరపు ప్రసన్న, రత్నాకర్‌ లు మరణించారు. 2007లో సినీనటి, 'దండోర' ఫేమ్ ప్రత్యూష కట్టంగూరు శివారులో కారు బోల్తా పడడంతో దుర్మరణం పాలైంది. 2014లో ఆకుపాముల వద్ద నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్‌ ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తూ, ట్రాక్టర్‌ ను ఢీకొనడంతో ఆయన మరణించారు. ఇక 2013లో నార్కట్ పల్లి కామినేని జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో టీడీపీ నేత లాల్‌ జాన్‌ బాషా కన్నుమూశారు. 2016లో సిమీ జాతీయ అధ్యక్షుడు మసూద్‌ కారు చిట్యాల వద్ద డివైడర్‌ ను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం నార్కట్‌ పల్లి ఫ్లైఓవర్‌ పై ఆగున్న లారీని ఢీకొట్టిన ఘటనలో టీఆర్‌ఎస్‌ నేత దుబ్బాక సతీశ్‌రెడ్డి మృతి చెందారు.

నల్గొండ జిల్లాలో ప్రమాదాలు జరుగగా, ప్రాణాలతో బయటపడిన ప్రముఖుల వివరాలు పరిశీలిస్తే, 2008లో అప్పటి విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళుతున్న కారు చిట్యాల వద్ద పల్టీలు కొట్టగా, ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ మరుసటి సంవత్సరం హైదరాబాద్‌ కు వస్తున్న హీరో నాని కారు, వెలిమినేడు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రమాదానికి గురైంది.

2009లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల తదితరులు మోతె వద్ద జరిగిన ప్రమాదంలో గాయాలతో బయటపడ్డారు. 2013లో నార్మాక్స్‌ చైర్మన్‌ గా ఉన్న గుత్తా జితేందర్‌రెడ్డి కారు చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ప్రమాదానికి గురైంది. 2015లో గాయని శ్రావణభార్గవి విజయవాడకు వెళుతుండగా, చిట్యాల వద్ద ఆమె కారు డివైడర్‌ ను ఢీకొంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ కు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే 2016లో నటి ప్రణీత ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఆమె కారు అదుపుతప్పి పల్టీలు కొట్టగా, ప్రణీత ప్రాణాలతో బయటపడింది.
Nalgonda District
Road Accident
Nani
NTR
Praneeta

More Telugu News