Chandrababu: వచ్చే ఎన్నికల్లో వీళ్లిద్దరిని ఓడించాల్సిన అవసరం ఉంది!: జగన్, పవన్ లపై విరుచుకుపడ్డ చంద్రబాబు

  • ‘అవిశ్వాసం’ పెడితే ఢిల్లీ వస్తానన్న పవన్ పత్తా లేరు
  • ప్రత్యేక హోదా కోసం వీరోచితంగా పోరాడుతున్నాం
  • నరేంద్ర మోదీని చూస్తే వైసీపీకి వణకు
వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్ కల్యాణ్ లను ఓడించాల్సిన అవసరం ఉందని, మనల్ని మోసం చేసిన బీజేపీ పంచన వీళ్లిద్దరూ చేరారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహిస్తున్న ‘నారా హమారా.. టీడీపీ హమారా’ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘అవిశ్వాసం’ పెడితే ఢిల్లీ వస్తానన్న పవన్ కల్యాణ్ పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారు. భయపడిపోయి మోదీ వెనకాల దాక్కుంటున్నారు. మనం వీరోచితంగా పోరాడుతుంటే.. రాజీనామాలు చేసి పిరికిపందలుగా ఇంటి దగ్గర కూర్చున్నారు. నరేంద్ర మోదీని చూస్తే వీళ్ల వెన్నెముకలో వణకు. అలాంటి వైసీపీ నాయకులు’ అని విమర్శించారు.

రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని, కేంద్రం ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే వరకు, ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు టీడీపీ పోరు ఆగదని మరోసారి స్పష్టం చేశారు. ‘టీడీపీ ఎన్నో చరిత్రలు సృష్టించింది.. మనది దృఢ సంకల్పం..ఉక్కు సంకల్పం. ఎన్డీఏ ప్రభుత్వం ఆటలు ఇక్కడ సాగవు.. ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండమని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా’ అని చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు.
Chandrababu
guntur
nara hamara

More Telugu News