sif: గంగా నదిలో 'పిశాచినీ ముక్తి పూజ'లు నిర్వహిస్తున్న భార్యాబాధితులు.. భార్యలకు పిండ ప్రదానాలు కూడా!

  • 'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్' ఆధ్వర్యంలో పూజలు
  • జంతువుల కన్నా పురుషుల పరిస్థితి దారుణంగా ఉందన్న సిఫ్ వ్యవస్థాపకుడు
  • సిఫ్ కు దేశ వ్యాప్తంగా 200 కేంద్రాలు

పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానాలను ఆచరిస్తే పాపాలు పోతాయనేది హిందువుల నమ్మకం. మరోవైపు, కొందరు భార్యాబాధితులు వారణాసిలోని గంగానదిలో పుణ్య స్నానాలను ఆచరించడంతో పాటు, ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ పూజ పేరు పిశాచినీ ముక్తి పూజ. ఈ పూజల విశేషం ఏమిటో తెలుసా? ఇలా చేస్తే తమ కుటుంబాల్లో కలహాలు లేకుండా, సుఖసంతోషాలు ఉంటాయనేది వారి నమ్మకం.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన సిఫ్ (సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. ఈ సంస్థను స్థాపించిన రాజేష్ వఖారియా మాట్లాడుతూ, మన దేశంలో జంతువులకు కూడా జంతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉందని, పురుషుల సంక్షేమం కోసం ఎలాంటి శాఖ లేదని చెప్పారు. పురుషులకు సమానమైన న్యాయ వ్యవస్థ లేదని అన్నారు. జంతువుల కన్నా పురుషులు హీనమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఏటా ఎంతో మంది పురుషులు తమ భార్యల ద్వారా హింసకు గురవుతున్నారని రాజేష్ అన్నారు. అలా భార్యల చేత టార్చర్ కు గురవుతున్న భర్తలు ఇక్కడకు వచ్చి, పూజలు చేస్తారని చెప్పారు. భార్యతో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కాని ఎలాంటి విభేదాలు రాకుండా ఈ పుణ్య స్నానాలు, పూజలను ఆచరిస్తున్నారని తెలిపారు. భార్య హింసలను తట్టుకోలేని భర్తలు... ఇక్కడ వారికి పిండ ప్రదానాలు కూడా చేస్తుంటారని చెప్పారు.

మన దేశంలో మహిళా సాధికారత పేరిట మగవాళ్లను హీనంగా చూస్తున్నారని రాజేష్ మండిపడ్డారు. తాను కూడా ఓ భార్యా బాధితుడినేనని ఆయన చెప్పారు. కొన్నేళ్ల క్రితం తన భార్య తనపై కేసు పెట్టిందని, ఐదేళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చానని తెలిపారు. జీవితంపై విరక్తి కలిగి, 2005లో తనలాంటి బాధితుల కోసం ఈ సంస్థను ప్రారంభించానని చెప్పారు. 13 ఏళ్ల కాలంలో తమ సంస్థకు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తింపు లభించిందని, దేశ వ్యాప్తంగా తమకు 200 కేంద్రాలు ఉన్నాయని, 4వేల మంది వాలంటీర్లు ఉన్నారని వెల్లడించారు. భర్తలపై కేసులు పెట్టే భార్యలకు తమ వాలంటీర్లు కౌన్సిలింగ్ కూడా ఇస్తారని చెప్పారు. 

More Telugu News