China: చైనాలోని రిసార్ట్ హోటల్‌లో అగ్నిప్రమాదం.. 19కి చేరిన మృతుల సంఖ్య

  • హోటల్‌లో ఎగసిపడిన అగ్ని కీలలు
  • చైనాలోని హార్బిన్ నగరంలో ఘటన
  • 70 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
చైనాలోని ఓ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కి చేరుకుంది. తీవ్రంగా గాయపడిన మరో 18 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం తెల్లవారుజామున హార్బిన్ నగరంలోని ఐలాండ్ రిక్రియేషన్ ప్రాంతంలోని బీలింగ్ హాట్‌స్ప్రింగ్ హోటల్‌లో ఈ  ఘటన చోటుచేసుకుంది. హోటల్‌లోని నాలుగో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో చుట్టుముట్టి భారీగా ఎగసిపడ్డాయి. హోటల్ సిబ్బంది, పర్యాటకులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 30 అగ్నిమాపక యంత్రాలు, 105 మంది సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు రాగలిగారు.

ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. హోటల్‌లో చిక్కుకున్న 70 మందిని రక్షించి వేరే ప్రాంతానికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
China
Fire Accident
Harbin
resort hotel
killed

More Telugu News