Supreme Court: ముల్లపెరియార్ జలాశయం నీటిమట్టంపై సుప్రీంకోర్టు ఆదేశం

  • ప్యానెల్ ఆదేశాల మేరకే పనిచేయాలని సూచించిన సుప్రీం కోర్టు
  •  ఆగస్టు 31వరకు 139 అడుగుల వరకు నీటిమట్టం ఉంచాలి 
  • తదుపరి విచారణ సెప్టెంబర్ 6కు వాయిదా
ముల్లపెరియార్‌ జలాశయ వివాదం కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయమని, దీనిని ఒక విపత్తుకు సంబంధించిన అంశంగా చూస్తున్నామని అత్యన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.  

ఈ క్రమంలో ఆగస్టు 31వరకు 139 అడుగుల వరకు నీటిమట్టం ఉంచాలని సుప్రీంకోర్టు నేడు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ వరదలకు ముల్లపెరియార్ డ్యామ్ లోని నీటిని ఒక్కసారిగా విడుదల చేయడమే కారణమని కేరళ రాష్ట్రం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటూ ప్యానెల్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.

  ముల్లపెరియార్ డ్యామ్ లో పూర్తిస్థాయి నీటిమట్టం చేరేవరకు వేచి చూడకుండా పలు దఫాలుగా నీటిని విడుదల చేసి వుంటే కేరళకు ఈ విపత్తు వచ్చేది కాదని కేరళ రాష్ట్రం పేర్కొంది. ఒక్కసారిగా నీటిని విడుదల చేయొద్దని చెప్పినా తమిళనాడు పట్టించుకోలేదని చెప్పిన కేరళ, విధిలేని స్థితిలో ఇడుక్కి జలపాతం నుండి నీటిని వదలాల్సి వచ్చిందని తెలిపింది. మున్ముందు ఇలాంటి విపత్తులు జరగకుండా ఒక పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని కేరళ కోరింది. కేంద్ర జలవనరుల కమీషన్ చైర్మన్ అధ్వర్యంలో రెండు రాష్ట్రాల కార్యదర్శులను సభ్యులుగా పర్యవేక్షక కమిటీని, తమిళనాడు నిర్వహిస్తున్న ముల్ల పెరియార్ డ్యామ్ రోజువారీ కార్యకలాపాలకు నిర్వహణా కమిటీని ఏర్పాటు చేయాలని కేరళ కోరింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ప్రస్తుతానికి ప్యానెల్ ను ఏర్పాటు చేసి, ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించింది.  
Supreme Court

More Telugu News