Jana Sena: ముమ్మిడివరం వైసీపీ నేత పితాని బాలకృష్ణ రాజీనామా!

  • జనసేనలో చేరనున్నట్టు ప్రకటన
  • పదవి నుండి తొలగించటం మనస్తాపానికి గురి చేసిందన్న పితాని 
  • జనసేన సిద్ధాంతాలు నచ్చాయన్న నేత 
వైసీపీకి చెందిన మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరనున్నట్టు  ప్రకటించారు. తనకు ఇంకా ఎనిమిదేళ్ల ప్రభుత్వ సర్వీస్ ఉన్నా, టికెట్ ఇస్తానని జగన్ చెప్పటంతో పార్టీలో చేరానని ఆయన చెప్పారు. అయితే, అర్థాంతరంగా తనను కోఆర్డినేటర్ పదవి నుండి తప్పించటం మనస్తాపానికి గురి చేసిందని చెప్పారు.

పవన్‌ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జనసేనలో చేరతానని బాలకృష్ణ చెప్పారు. జనసేన సిద్ధాంతాలపట్ల ఆకర్షితుడనై పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదన్నారు. జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచన’ను తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ అన్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరనున్నారు.

Jana Sena
YSRCP
Andhra Pradesh

More Telugu News