Vijayawada: తన భార్యతో చాటింగ్ చేస్తున్నాడన్న కసితో.. పురోహితుడిని హత్య చేసిన విజయవాడ వ్యాపారి!

  • విజయవాడలోని కృష్ణలంకలో ఘటన
  • భార్య ఫేస్ బుక్ చాటింగ్ పై ఆగ్రహంతో ఊగిపోయిన భర్త
  • స్నేహితులతో కలసి పురోహితుడి హత్య
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య ఫోన్ లో మరో వ్యక్తితో ఫేస్ బుక్ లో చాటింగ్ చేయడంతో ఆగ్రహించిన భర్త సదరు వ్యక్తిని దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కృష్ణలంకలోని మెట్ల బజార్ కు చెందిన రామాంజనేయులు శర్మ(35) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఇతనికి బాలాజీ నగర్ లో ఉండే ఓ వివాహితతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచూ చాటింగ్ చేసుకోవడం, ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాగా, భార్య ప్రవర్తనపై భర్త సాయి శ్రీనివాస్ కు అనుమానం రావడంతో ఆమె ఫోన్ ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాస్.. రామాంజనేయులును హత్య చేయాలని ప్లాన్ వేశాడు.

ఆగస్టు 15న తన ఎలక్ట్రానిక్స్ షాపు వద్ద పూజ చేయాలంటూ రామాంజనేయులు శర్మను శ్రీనివాస్ ఫోన్ లో ఆహ్వానించాడు. శర్మ అక్కడికి చేరుకోగానే స్నేహితులు ఎన్టీఆర్, మున్నా, సాయ, సతీశ్,ఫరూక్ లతో కలసి శ్రీనివాస్ విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో చుట్టుపక్కలవారు అక్కడికి రాగా, తామంతా స్నేహితులమని సర్దిచెప్పాడు. చివరికి బైక్ పై ఎక్కించుకుని తేలప్రోలు ప్రాంతంలో పొలాల్లోకి తీసుకెళ్లి మరోసారి చావగొట్టారు. అనంతరం అతను చనిపోవడంతో రోడ్డుపై పారేసి వెళ్లిపోయారు.

స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శర్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.  మృతుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. శర్మకు చివరిసారిగా శ్రీనివాస్ కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానే స్నేహితులతో కలసి శర్మను హత్యచేశానని శ్రీనివాస్ అంగీకరించాడు. దీంతో ఆరుగురు నిందితులను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
Vijayawada
KRISHNA LANKA
Facebook
murder

More Telugu News