Chennupati Vidya: విజయవాడ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్నుమూత

  • ప్రమఖ హేతువాది గోరా కుమార్తె
  • విజయవాడ నుంచి లోక్‌సభకు రెండుసార్లు
  • సంతాపం తెలిసిన నేతలు
విజయవాడ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య (84) మృతి చెందారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికైన విద్య.. ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు (గోరా) కుమార్తె. విజయనగరంలో 1934లో జన్మించారు. 1950లో చెన్నుపాటి శేషగిరిరావును ఆమె వివాహం చేసుకున్నారు. 1980లో తొలిసారి విజయవాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో రెండోసారి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.

అసలు 1974లోనే ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే దరఖాస్తులో కులం, మతం అనే కాలమ్‌ను ఖాళీగా వదిలివేయడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ ఖరారు కాలేదు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. కులం, మతం అవసరం లేని రోజున తనను పిలవాలని నేరుగా ఇందిరాగాంధీకి లేఖ రాశారు.

కాగా, విద్య మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సహా వివిధ పార్టీల నేతలు విద్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Chennupati Vidya
Vijayawada
Lok Sabha
Andhra Pradesh
Congress

More Telugu News