Suguna: తిరుమలలో స్థానిక ఎమ్మెల్యేకి అవమానం!

  • విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తా 
  • సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రొటోకాల్‌ దర్శనానికి వెళ్లను
  • సంప్రోక్షణకు అనుమతించకపోవడంపై ఎమ్మెల్యే సుగుణ మండిపాటు
తిరుమల శ్రీవారి సన్నిధిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకి అవమానం జరిగింది. శ్రీవారి మహా సంప్రోక్షణను చూసేందుకు వెళ్ళిన స్థానిక ఎమ్మెల్యే సుగుణను టీటీడీ అధికారులు అనుమతించలేదు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె మీడియాకి చెప్పారు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యే సుగుణ అధికారులపై మండిపడ్డారు. తాను చాలా అవమానానికి గురయ్యానని చెప్పిన ఎమ్మెల్యే.. టీటీడీ ఇక్కడి అధికారుల సొత్తు కాదని అసహనం వ్యక్తం చేశారు.

మహా సంప్రోక్షణ ఘట్టాన్ని చూసేందుకు తనని అనుమతించకపోవటం అధికారుల నిర్ణయమా? లేక బోర్డు తీసుకున్న నిర్ణయమా? అన్నది తనకు తెలియాలన్నారు. ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించిన ఎమ్మెల్యే సుగుణ తన విషయంలో అధికారుల తీరుకు మనస్తాపం చెందారు.

సతీసమేతంగా బోర్డుమెంబర్లు, ఈవో, జేఈవో, ప్రొటోకాల్‌ లేని వ్యక్తులు కూడా తానున్న సమయంలో క్రతువు ముగించుకుని బయటకు రావడం చూసి ఆవేదన చెందానని చెప్పారు. కనీసం చివరి రోజైనా ఆహ్వానిస్తారని చూస్తే టీటీడీ అధికారుల నుండి ఆహ్వానం రాకపోవటం మరింత బాధించిందని ఆమె తెలిపారు. ఈ విషయంపై ఎంత దూరమైనా వెళతానని, ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రోటోకాల్ దర్శనానికి వెళ్లనని చెప్పారు ఎమ్మెల్యే సుగుణ.
Suguna
Tirumala
Chandrababu

More Telugu News