Rahul Gandhi: రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ‘కాంగ్రెస్’ నాశనమే: మంత్రి కేటీఆర్

  • వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలు కాక తప్పదు
  • రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు
  • ఓట్ల కోసమే రాహుల్ పర్యటించారు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. రాహుల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమేనని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలు కాక తప్పదని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ ఈరోజు పర్యటించారు. సిరిసిల్లలోని గీతా నగర్ లో ఉన్న నెహ్రూ పార్క్ ను ప్రారంభించారు.

అనంతరం, కరీంనగర్ లోని ఎలగండల్ క్రాస్ రోడ్డు వద్ద కరీంనగర్ నుంచి కామారెడ్డి వరకు నాలుగు లేన్ల రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కరీంనగర్ లో ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో రాహుల్ పర్యటించి వెళ్లడంపై ఆయన విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లుగా రాని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వచ్చింది ఓట్ల కోసమేనని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇక్కడ ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
Rahul Gandhi
KTR

More Telugu News