Rahul Gandhi: హైదరాబాద్ కు చేరుకున్న రాహుల్ గాంధీ!

  • బీదర్ బహిరంగ సభకు హెలికాప్టర్ లో ప్రయాణం
  • మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి హైదరాబాద్ కు
  • స్వయం సహాయక బృందాలతో సాయంత్రం భేటీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం బీదర్ లో జరిగే ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో అక్కడికి బయలుదేరారు. కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాహుల్ తొలిసారి తెలంగాణకు వచ్చారు.

2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. లోక్ సభతో పాటు వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే రాహుల్ ను తెలంగాణలో పర్యటించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు కోరారు.

బీదర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు రాహుల్ హైదరాబాద్ కు తిరిగివస్తారు. సాయంత్రం 4.15 వరకూ ఇక్కడి క్లాసిక్ కన్వెన్షన్ హాల్ లో మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బస చేయనున్నారు.
Rahul Gandhi
Hyderabad
Telangana

More Telugu News