jagan: జగన్ వెళ్తున్న దారి దేశానికి మంచిది కాదు.. ఆయన బాగుండాలనే కోరుకుంటా: అశోక్ గజపతిరాజు

  • జగన్ ఎంచుకున్న వైఖరి వ్యక్తిగతంగా కూడా ఆయనకు మంచి చేయదు
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం
  • అభివృద్ధిని సాధిస్తూనే.. హక్కుల కోసం కేంద్రంపై పోరాడుతాం
రాజకీయాల్లో చంద్రబాబు, వైయస్ రాజశేఖరరెడ్డి, తాను సమకాలికులమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. తన కొలీగ్ కుమారుడిగా వైసీపీ అధినేత జగన్ బాగుండాలనే తాను కోరుకుంటానని ఆయన తెలిపారు. అయితే, ఆయన వెళ్తున్న దారి మాత్రం దేశానికి మంచిది కాదని చెప్పారు. ఆయన ఎంచుకున్న వైఖరి రాజకీయాలకే కాదు, వ్యక్తిగతంగా ఆయనకు కూడా మంచి చేయదని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

ప్రస్తుతానికి ఏపీ ప్రజల్లో సంతృప్త స్థాయి చాలా ఎక్కువగా ఉందని... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయమని అశోక్ తెలిపారు. రాష్ట్రానికి విభజన సమస్యలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగింది, ఇస్తామని చెప్పింది జాతీయ పార్టీలేనని... ఇవ్వాల్సిన బాధ్యత వాటిపైనే ఉందని అన్నారు. అభివృద్ధిలో ఏపీ అత్యుత్తమ స్థితిలో ఉందని... దాన్ని కొనసాగిస్తూనే, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు.

వ్యక్తిగతంగా దివంగత ఎన్టీఆర్ అత్యున్నతమైన వ్యక్తి అని, ఆయన వల్లే తెలుగు జాతికి గుర్తింపు వచ్చిందని అశోక్ తెలిపారు. ఆ రోజున కొన్ని ఇబ్బందులు వచ్చాయని, వాటిని సరిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదని, అందుకే తాము బయటకు వచ్చామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు ఎప్పటికీ గౌరవమేనని అన్నారు. 
jagan
ashok gajapathiraju
Chandrababu
ys

More Telugu News