kerala: వానలకు కేరళ విలవిల.. 18 మంది మృతి!

  • కేరళను కుదిపేస్తున్న వర్షాలు
  • విరిగిపడుతున్న కొండ చరియలు
  • ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
భారీ వర్షాలతో  కేరళ అతలాకుతలం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ కారణంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. మరికొందరు  గల్లంతయ్యారు. ఒక్క ఇడుక్కీ ప్రాంతంలోనే కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతి చెందినట్టు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. మలప్పురంలో ఐదుగురు, కన్నూర్‌లో ముగ్గురు, వయనాడ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పాలక్కడ్‌, కోజికోడ్, వయనాడ్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు.

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. వరద ఉద్ధృతికి వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా ఇడుక్కీ రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో గురువారం గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. 26 ఏళ్ల తర్వాత ఈ డ్యామ్ గేట్లు తెరవడం ఇదే తొలిసారి.  
kerala
Floods
Dead
Rains
India

More Telugu News