Chandrababu: ఏపీలో అభివృద్ధి పనుల ఫలితాలు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నాయి: సీఎం చంద్రబాబు

  • గ్రామాలు గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్నాయి
  • సంక్షేమ పథకాల లబ్ధి అట్టడుగు స్థాయికి చేరాలి
  • ‘గ్రామదర్శిని’ని విజయవంతం చేయాలి
ఏపీలో అభివృద్ధి పనుల ఫలితాలు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నాయని, అన్ని గ్రామాలు గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్నాయని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రులతో చంద్రబాబు ఈరోజు సమీక్షించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, గ్రామదర్శిని అమలుపై సమీక్షించారు. కార్యక్రమాల అమలు ఎంత ముఖ్యమో, ప్రజలను చైతన్యపరచడమూ అంతే ముఖ్యమని, మెరుగైన జీవనం ఎంత ముఖ్యమో.. ఆనందం, సంతృప్తీ అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. రాబోయే ఆరు నెలలు గ్రామదర్శిని, వార్డు దర్శిని కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని, గురు, శుక్ర వారాల్లో పర్సన్ ఇన్ ఛార్జ్ లు గ్రామాల్లో పర్యటించాలని, ఐదు నెలల పాటు వారానికి రెండు రోజులు..మొత్తం 40 రోజులు ప్రజల్లోనే ఉండాలని, 175 నియోజకవర్గాల్లో ‘గ్రామదర్శిని’ని విజయవంతం చేయాలని ఆదేశించారు. 

సంక్షేమ పథకాల లబ్ధి అట్టడుగు స్థాయికి చేరాలని, ప్రజల్లో సంతృప్తి స్థాయి గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. బాగా పని చేసే వారిని ప్రోత్సహించాలని తద్వారా ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని, ప్రతి గ్రామంలో అట్టడుగు వారికి సంక్షేమ పథకాలు అందాలని, మన అభివృద్ధి, సంక్షేమం సమాజాన్ని చైతన్యపరచాలని, స్థానిక కళాకారుల ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో పరస్పర సహకార స్ఫూర్తి పెరగాలని, మంత్రులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలకు పరిష్కారం అన్వేషించాలని..ప్రత్యామ్నాయాలు చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో విభేదాలు విస్మరించే వాతావరణం కల్పించాలని, పట్టణాల నుంచి పల్లెల్లో ఉండాలనే తపన ప్రజల్లో పెంచాలని, ప్రతీ గ్రామం ఓ పర్యాటక కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
Chandrababu
cabinet meeting

More Telugu News