Nara Lokesh: పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే.. ఆయన ఆరోపణలే బాధను కలిగిస్తున్నాయి!: నారా లోకేష్

  • నాపై పవన్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు బాధను కలిగిస్తున్నాయి
  • వ్యక్తిగత విమర్శలపై పవన్ లాగానే నేను కూడా బాధపడుతున్నా
  • జగన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అయితే, తనపై ఆయన చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు మాత్రం బాధను కలిగిస్తున్నాయని చెప్పారు. తాను అవినీతిపరుడినే అయితే రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తున్న పవన్... వాటిని ఎందుకు నిరూపించలేకపోతున్నారని అన్నారు.

వ్యక్తిగత విమర్శలకు సంబంధించి పవన్ ఎలా బాధపడుతున్నారో... తాను కూడా అలాగే బాధపడుతున్నానని చెప్పారు. సంస్థలను ప్రారంభించే ప్రతి ఒక్కరికీ ఒకే పాలసీ అమలు చేస్తామని... పవన్ కల్యాణ్ కూడా కంపెనీలు తెస్తే, వాటికి కూడా అదే పాలసీ వర్తింపజేస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని ఆపుతామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కేవలం 10 మంది కోసం రాజధాని నిర్మాణం ఆగదని చెప్పారు.

కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని లోకేష్ అన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రానికి అనుభవమున్న వ్యక్తే ముఖ్యమంత్రి కావాలనే విషయం జగన్ వ్యాఖ్యలతో మరోసారి నిరూపితమైందని అన్నారు. 
Nara Lokesh
Pawan Kalyan
Jagan
amaravathi

More Telugu News