Chandrababu: జగన్ చెప్పినట్టు చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరిని ఈదినట్టే!: చంద్రబాబు

  • బీజేపీయే వైసీపీ ట్రాప్ లో పడింది
  • జగన్ చెప్పినట్టు రాజీనామా చేస్తే అంతే సంగతులు
  • ఒకటి, రెండు సీట్ల కోసం కక్కుర్తి పడుతున్న బీజేపీ
భారతీయ జనతా పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడిందని, ఏపీ ప్రయోజనాల విషయంలో ఆ పార్టీయే యూటర్న్ తీసుకుందని ఆరోపించిన సీఎం చంద్రబాబునాయుడు, జగన్ చెబుతున్నట్టుగా ఎంపీలతో రాజీనామా చేస్తే, కుక్క తోక పట్టుకుని గోదావరిని ఈదినట్లేనని, తాను ఆ పని చేయలేనని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన 'నగర దర్శిని' కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన వైసీపీని నమ్ముకుంటే, తమకు ఒకటో, రెండో సీట్లు వస్తాయని బీజేపీ కక్కుర్తి పడుతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకునేంత వరకూ విశ్రమించబోనని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి వరప్రదాయిని వంటి పోలవరం ప్రాజెక్టుపైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వీళ్లు మనుషులు కాదని, రాక్షసులని నిప్పులు చెరిగారు. ప్రతివారమూ బోనులో నిలబడేవారు తనను ప్రశ్నిస్తున్నారని, లాలూచీ పడేవాళ్లకు ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారని వ్యాఖ్యానించారు. ఎవరేం చేస్తున్నారో గమనించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదు కోట్ల మంది ఆంధ్రులంటే లెక్కలేనితనంగా కేంద్రం ప్రవర్తిస్తోందని, ఏపీ కూడా దేశంలో భాగమేనన్న సంగతిని ఆ పార్టీ మరచిందని మండిపడ్డారు. అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం జరగకపోతే దేశానికి మంచిది కాదని చెప్పారు.
Chandrababu
Jagan
BJP
YSRCP

More Telugu News