Jagan: జగన్‌తో సెల్ఫీపై స్పందించిన నటి అలేఖ్య ఏంజెల్!

  • పవన్‌పై జగన్ వ్యాఖ్యలతో అభిమానుల మనస్తాపం
  • జగన్-అలేఖ్యల ఫొటోను పోస్టు చేసిన పవన్ అభిమానులు
  • స్పందించిన అలేఖ్య.. ఫేస్‌బుక్ లో వివరణ
వైసీపీ చీఫ్ జగన్‌తో నటి, మోడల్ అలేఖ్య ఏంజెల్‌ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జగన్ తీవ్రవ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ ఫొటో సోషల్ మీడియాకెక్కింది. జగన్‌తో తానున్న ఫొటో వైరల్ కావడంతో అలేఖ్య స్పందించింది. ఆ ఫొటోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది.

గతేడాది ఫిబ్రవరి 18న ఓ సీడీ లాంచ్ సందర్భంగా లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో ఆయనతో తీసుకున్న సెల్ఫీ ఇదని, ఈ ఫొటో పట్టుకుని రాద్ధాంతం చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్‌ను ఇరుకున పెట్టేందుకు తన ఫొటోను వాడుకోవడం తగదని పవన్ అభిమానులకు హితవు పలికింది. ఇటువంటి అర్థంపర్థం లేని రూమర్ల ప్రచారం వల్ల తమ గౌరవం, కీర్తి దెబ్బతింటాయని, తానైతే చాలా హర్ట్ అయ్యానని వాపోయింది.

జగన్ తండ్రిలాంటివాడని, పెద్దన్నయ్య లాంటివాడని పేర్కొన్న అలేఖ్య సీడీ లాంచింగ్‌కు తన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారని పేర్కొంది. మిగతా వారితో కలిసి జగన్‌ను రిక్వెస్ట్ చేసి మరీ సెల్ఫీ తీసుకున్నామని వివరించింది.

తాను కూడా పవన్ అభిమానినేనని, ఆయన మానవత్వం గల మనిషి అని పేర్కొంది. ఓ నటుడుగా ఆయన తనకు ఆదర్శమని, అటువంటి వారి గౌరవాన్ని ఇటువంటి పోస్టులు పెట్టి దెబ్బతీయవద్దని పవన్ అభిమానులకు సూచించింది. అమాయకులపై అభాండాలు వేయడం ఆపాలని కోరింది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన అలేఖ్య.. ఇది చదివాకైనా ఆ పోస్టులు తొలగిస్తారని భావిస్తున్నట్టు చెప్పింది.
Jagan
YSRCP
Alekhya Angel
Model
Actress

More Telugu News