Rahul Gandhi: ఢిల్లీలో 'ఉచిత కౌగిలింత'ల ప్రచారం మొదలెట్టిన కాంగ్రెస్!

  • ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ‘ఫ్రీ హగ్’ కార్యక్రమం
  • బీజేపీ విమర్శలను తిప్పికొట్టేందుకు వ్యూహం
  • విద్వేషాన్ని తుడిచేద్దామంటూ ప్లకార్డుల ప్రదర్శన
లోక్ సభలో ఇటీవల అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం తన స్థానానికి వెళ్లి కూర్చుని సహచరులతో మాట్లాడుతూ కన్ను గీటారు. ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, కమలనాథులు రాహుల్ కౌగిలింతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రాహుల్ కౌగిలింత స్పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉచిత కౌగిలింత (ఫ్రీ హగ్) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుకున్న వారికి కౌగిలింత ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ‘విద్వేషాన్ని తుడిచేద్దాం’, ‘ద్వేషానికి నో చెబుదాం’, ‘దేశాన్ని కాపాడుదాం‘ పేరుతో ప్లకార్డుల్ని ప్రదర్శించారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతూ.. ‘మీ(బీజేపీ) మనసుల్లో నాపట్ల ఎంతో ద్వేషం ఉంది. మీరు నన్ను పప్పు అని ఎగతాళి చేసినా, నన్ను దుర్భాషలాడినా సరే, నా మనసులో మీపై ఎలాంటి ద్వేషం ఉండదు’ అని చెప్పారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ముంబైలోని అంధేరి ప్రాంతంలో ’ద్వేషంతో కాదు ప్రేమతో గెలుస్తాం‘ అనే ట్యాగ్ లైన్ తో రాహుల్ గాంధీ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
Rahul Gandhi
Congress
New Delhi
Narendra Modi
BJP

More Telugu News