Chandrababu: లెక్కలేనితనం బీజేపీకి మంచిది కాదు: సీఎం చంద్రబాబునాయుడు

  • టీడీపీ ఎంపీల పోరాటానికి ప్రజల్లో ప్రశంసలు రావాలి
  • అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలి
  • ఏపీ సంక్షేమం చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే
ఆధిక్యత ఉందని ఇంత లెక్కలేనితనం కేంద్రంలోని బీజేపీ నేతలకు మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ ఎంపీలతో ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఢిల్లీలో మన ఎంపీల పోరాటానికి ప్రజల్లో ప్రశంసలు రావాలి. మీ నాయకత్వ సామర్ధ్యం చూపడానికి ఇదొక అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. సభలో ఆందోళనలు కొనసాగించాలి. సభ వెలుపల నిరసనలు తెలపాలి. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలి. చట్టాన్ని ఎందుకు అమలు చేయరని ప్రశ్నించాలి? ఏపీ పునర్విభజన చట్టం అమలు చేసే దాకా వదిలిపెట్టే  ప్రసక్తే లేదు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు వదిలిపెట్టం. తెలుగు పౌరుషం చూపిస్తాం. సాధించే వరకు వదిలిపెట్టం. మేము కూడా పన్నులు చెల్లిస్తున్నాం. మా సంక్షేమం చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఏ రాష్ట్రంలోనైనా ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదు’ అని చంద్రబాబు అన్నారు.

ఇన్నాళ్లూ అడిగాం ..ఇప్పుడు నిలదీస్తున్నాం

‘ఇన్నాళ్లూ అడిగాం, ఇప్పుడు నిలదీస్తున్నాం. నమ్మకద్రోహంపై ధర్మపోరాటం చేస్తున్నాం. ఇది రెండు పార్టీల మధ్య సమస్య కాదు. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధం. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ప్రశ్నోత్తరాలు, శూన్యగంట, బిల్లులపై చర్చలు. ఎక్కడ అవకాశం దొరికినా ఏపీకి జరిగిన అన్యాయంపై మన ఎంపీలు ధ్వజమెత్తాలి’ అని చంద్రబాబు సూచించారు.

పొజిషన్స్ మారినంత మాత్రాన పాలసీలు మారతాయా?

‘పొజిషన్స్ (స్థాయి) మారినంత మాత్రాన పాలసీలు (విధానాలు) మారతాయా? ప్రతిపక్షం అధికారంలోకి వచ్చాక హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత లేదా? ఒకవైపు కేంద్రంలో బీజేపీ నేతలు చేస్తున్న నష్టం.. మరోవైపు రాష్ట్రంలో బంద్ లతో వైసీపీ చేస్తున్న నష్టం. వీటన్నింటిపైనా ప్రజలను చైతన్యపరచాలి. రెండువిధాలా రాష్ట్రాన్ని నష్టపరచడం మంచిది కాదు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న రాష్ట్రం బంద్ ల కారణంగా కుదేలవుతుంది. కేంద్రం చేసిన తప్పులకు బంద్ ల ద్వారా రాష్ట్రాన్ని శిక్షించడం ఏమిటి? కేంద్రంపై పోరాటం వదిలేసి రాష్ట్రంలో బంద్ ల వల్ల సాధించేదేమిటి? రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే వచ్చే పెట్టుబడులు కూడా రావు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతాం’ అని అన్నారు.

‘మన పోరాటం మన ప్రజలపై కాదు. కేంద్రంపై పోరాటంలో మన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వచ్చే దేమిటి? నాలుగేళ్లుగా వైసీపీ వల్ల రాష్ట్రానికి ఒనగూడిన మేలు శూన్యం. ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా రాష్ట్రానికి ఏదో విధంగా నష్టం కలిగించే రీతిలోనే వైసీపీ నాయకుల వ్యాఖ్యలు, చేష్టలు ఉన్నాయి. రాజీనామాలు చేసి రోడ్లపై తిరిగితే ప్రజలు వైసీపీని నమ్మరు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన పరిస్థితి మనది. రాష్ట్రానికి వచ్చే రాబడిని దెబ్బతీయడం మంచిది కాదు. అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఒకవైపు అభివృద్ది, సంక్షేమం.. మరోవైపు హక్కుల కోసం పోరాటం చేయడమే మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం’ అని అన్నారు.  
Chandrababu
bjp

More Telugu News