Chittoor District: భర్త మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు డబ్బు లేక... భిక్షాటన చేసిన భార్య!

  • మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భర్త
  • శవాన్ని తీసుకెళ్లేందుకు సాయం చేయాలంటూ కన్నీటి వేడుకోలు
  • ఆసుపత్రి వర్గాలపై రోగుల బంధువుల ఆగ్రహం
అనారోగ్యంతో ఉన్న భర్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లేందుకు డబ్బులేని పరిస్థితిలో ఓ మహిళ భిక్షాటన చేసిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో కన్నీరు పెట్టించింది. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు బాబూ సాహెబ్ ను చికిత్స కోసం ఆయన భార్య దౌలత్ బీ ఆసుపత్రిలో చేర్పించింది. అతని పరిస్థితి విషమంగా ఉందని, తిరుపతికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో, తన వద్ద డబ్బులేదని మొరపెట్టుకుంది.

దీంతో చేసేదేమీ లేక అతన్ని అడ్మిట్ చేసుకుని చికిత్సను ప్రారంభించారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ, గొంతు బిగుసుకుపోయి, ఊపిరి తీసుకోలేని స్థితిలో నిన్న బాబూ సాహెబ్ మరణించాడు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకు వెళ్లేందుకు డబ్బుల్లేని పరిస్థితిలో ఉన్న ఆమె, ఏడుస్తూ, అక్కడి ఇతర రోగులు, వారి సహాయకులను సాయం చేయాలంటూ యాచించింది. కొందరు దయ చూపి డబ్బులివ్వగా, ఓ ఆటోలో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. శవాన్ని తరలించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేయని ఆసుపత్రి వర్గాలపై రోగుల బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Chittoor District
Madanapalle
Hospital
Begging

More Telugu News